
తెలంగాణలో ఇవాళ (ఆదివారం) నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రారంభం కానున్నాయి. గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా ఈరోజు నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నగరం మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేయనుంది.
చంద్రవంచలో సీఎం పర్యటన
ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పథకాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2.30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నూరుశాతం అమలుచేస్తామని సీఎం ప్రకటించారు.
ఒకే రోజు నాలుగు పథకాలు ప్రారంభం
వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా (Rythu Bharosa) ఇస్తామని రేవంత్ తెలిపారు. భూమిలేని నిరుపేదలకు, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లభిస్తుందని చెప్పారు. గ్రామసభల్లో లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున ఆదివారం నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
అది నిరంతర ప్రక్రియ
మరోవైపు రేషన్ కార్డుల (Ration Cards) ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వేలు, ప్రజాపాలన, ప్రజావాణి లేదా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. జాబితాలో లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
అర్హులు ఆందోళన చెందొద్దు
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా కోసం రూ.7,625 కోట్లు .. రూ.22,000 కోట్లతో రుణమాఫీ (Runa Mafi) అమలు చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. త్వరలోనే వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12,000 సాయం చేయబోతున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన పేదలెవ్వరూ అభద్రతకు గురికావద్దని.. వారికి తప్పకుండా పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.