Mana Enadu : పేదలు ఆత్మగౌరవంతో బతకాలని.. వారికంటూ సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Housing Scheme). ఈ పథకంలో భాగంగా పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం యాప్ సిద్ధం చేసిన ప్రభుత్వం ఈనెల 5వ తేదీ (గురువారం)న ఈ యాప్ ను ప్రారంభించనుంది.
ఇందిరమ్మ ఇళ్లు యాప్
తొలుత నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్(Indiramma Indlu App) ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించారు. ఇందులో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారికంగా యాప్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం రోజున రాష్ట్ర సచివాలయంలో ఈ యాప్ ను ప్రారంభించనున్నారు.
6 నుంచి లబ్దిదారుల ఎంపిక
శుక్రవారం (డిసెంబరు 6) నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని పునరుద్ఘాటించారు. గ్రామీణులను దృష్టిలో పెట్టుకుని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు.
యాప్‌లో 35 ప్రశ్నలు
ఈ యాప్‌లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ సంఖ్య (Aadhar Card Number), సొంత స్థలం ఉందా? ఆదాయం ఎంత? గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా? అనే విషయాలపై 30-35 ప్రశ్నలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇళ్లులేని వారి వద్దకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్‌లో నమోదు చేసి.. వాటి ఆధారంగా ఈ పథకానికి ఆయా దరఖాస్తుదారులు అర్హులా? కాదా? అనేది నిర్ణయించనున్నారు.
తొలి విడతలో వారికే ఫస్ట్ ఛాన్స్
ఇక మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో దివ్యాంగులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక రెండో విడతలో ఇంటి స్థలం లేనివారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.