
Mana Enadu : తెలంగాణ సాదాబైనామా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపికబురు చెప్పింది. లిఖితపూర్వక ఒప్పందంతో జరిగిన భూములు కొనుగోళ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. జూన్ 2, 2014 నాటికి తెల్లకాగితాలపై ఒప్పందాల(సాదాబైనామా) ద్వారా జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌ఓఆర్-2024 చట్టం సెక్షన్ 6(1) కింద నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపిన సర్కార్.. ఆర్డీవో స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించింది.
ROR చట్టంతో సాదాబైనామాలకు హక్కులు
కొత్త ఆర్‌ఓఆర్ చట్టం (Telangana ROR Act) ద్వారా సాదాబైనామాలకు భూ హక్కులు వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత సర్కారే సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించినా.. నాలుగేళ్లుగా వాటికి పరిష్కారం లభించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాదాబైనామా భూములు ఉన్న రైతులకు భూ హక్కులు లభించనున్నాయి.
భూ భారతిలో ప్రత్యేక ఆప్షన్
ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ(Lands Regularization)లో అడ్డుంకులను తొలగించి వీటి పరిష్కారానికి భూ- భారతిలో ప్రత్యేక ఆప్షన్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం లిఖితపూర్వక ఒప్పందం ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల పేర్లు రికార్డుల్లో లేకపోవటంతో వారు భూహక్కుదారులుగా గుర్తింపు పొందలేకపోయారు.
ఆ సమస్యలన్నింటికీ చెక్
మరోవైపు సాదాబైనామా పత్రాలు చట్టపరంగా ధ్రువీకరించినవి కాకపోవడంతో భూమి మీదు తమ హక్కులను రుజువు చేసుకోవటం రైతులకు కష్టంగా మారింది. పట్టాలు లేకపోవడం వల్ల బ్యాంకు లోన్లు, రాయితీలు అందటం లేదు. సాదాబైనామాల క్రమబద్ధీకరణతో ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభించనుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.