
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) వల్ల ఎంతో మంది యువత ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ గేమ్స్ కు బానిసై అప్పుల పాలై వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వాటికి మరింత విశ్వసనీయత కల్పిస్తూ యువత జీవితాలు నాశనం చేసుకోవడానికి కొందరు సెలబ్రిటీలు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేసి.. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగుపై సిట్
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, రమ్మీ కేసులు, చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ను నిరోధించడానికి, నిషేధించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.
వారిపై చర్యలు తప్పవు
“ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయస్థాయి నేరంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ (Rummy) పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించాం. వీటిని నిరోధించడానికి, నిషేధించడానికి సిట్ ఏర్పాటు చేయనున్నాం. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ నేరాలకు శిక్షలను కూడా సవరించుకోవాల్సి ఉంది. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీకి ప్రచారం కల్పించినవారిని విచారించాం. అయితే దీంతోనే సమస్య పరిష్కారం కాదు. సిట్ ఏర్పాటు చేసి వీటికి అడ్డుకట్ట వేస్తాం. ఆన్‌లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవు” అని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.