బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR Latest News)కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు ముగించిన హైకోర్టు (Telangana High Court).. పిటిషన్ కొట్టివేస్తూ నేడు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ, ఈడీ ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్లైంది.
ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ
హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో (Formula E Race Case) కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. మాజీ మంత్రిని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు కూడా ఇచ్చాయి. అయితే ఈనెల 6వ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తన లాయర్ తో కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ ను పోలీసులు గేటు వద్ద నిలిపివేశారు. లీగల్ టీమ్ కు అనుమతి లేదని చెప్పడంతో.. కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే
ఈ క్రమంలో ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్‌కు ఏసీబీ మరోమారు నోటీసులు (KTR ACB Notices) జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ కాస్త సమయం కోరారు. ఈ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు సమయం ఇవ్వాలని కోరగా.. తాజాగా వచ్చిన తీర్పుతో ఈడీ (KTR ED Inquiry) విచారణకు కూడా తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది.







