వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో (Telangana Hihg Court) చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. చెన్నమనేని రమేశ్ (hennamaneni Ramesh) జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పింది. తప్పుడు సమాచారం ఇచ్చారని రూ.30 లక్షల జరిమానా విధించింది.
15 ఏండ్లుగా తప్పుదోవ.. కోర్టు ఆగ్రహం
తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ (Aadi srinivas) 15 ఏండ్ల క్రితం చెన్నమనేని రమేశ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పౌరసత్వానికి సంబంధించిన కేసు 15 ఏళ్లపాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆ పిటిషన్‌పై సోమవారం సైతం హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రమేశ్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన జర్మనీ పౌరుడేనని (German citizenship) స్పష్టం చేసింది. ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్ట్ మీదనే రాకపోకలు సాగిస్తున్నారని గుర్తించింది.
30 లక్షల జరిమానా
విచారణ సమయంలో చెన్నమనేని రమేశ్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని కోర్టు మండిపడింది. మాజీ ఎమ్మెల్యేకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో ప్రస్తుత ఎమ్మెల్య ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని, మరో రూ.5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.






