వసంత పంచమికి బాసర సరస్వతి అమ్మవారం ముస్తాబు

మన ఈనాడు: సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం ముస్తాబైంది.
బుధవారం బాసరలో వసంత పంచమి వేడుక జరగనుంది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి మనరాష్ట్రంతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అశేష జనవాహినికి సరిపడే ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

క్యూలైన్‌లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందించనున్నారు. ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలు ముస్తాబయ్యాయి. సుమారు 70వేల మంది వరకు భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసాదాల కొరత రానీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు నిరంతర అన్నదానం నిర్వహించనున్నారు.

ప్రత్యేకత, పూజలు
చదువుల తల్లి జన్మదినం సందర్భంగా మాత సన్నిధిలో అక్షర శ్రీకారం నిర్వహించుకుంటే తమ చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. అందుకే ఏటా వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. ఉత్సవం సందర్భంగా బుధవారం వేకువజామున రెండు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహిస్తారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమవుతాయి. సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు.

ఉత్సవంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం, గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్‌ స్థలాల వద్ద అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు బాసర ఎస్సై గణేశ్‌ తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నట్లు సీఐ తెలిపారు.
వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు బాసరకు తరలి వస్తున్నారు. సాయంత్రానికి ఆలయ అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. బాసర వచ్చే బస్సులు, రైళ్లు భక్తులతో కిటకిటలాడాయి. ప్రైవేటు లాడ్జీలన్ని నెల రోజుల క్రితమే బుకింగ్‌ కావడంతో చాలా మంది భక్తులు బయటే ఉండిపోయారు. బాసర వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిరంతరాయంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ విజయరామారావు తెలిపారు. బాసర ఆలయం విద్యుత్‌కాంతుల్లో శోభాయమానంగా కనిపిస్తుంది. ఆలయంలో ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు.

ఒకరోజు ముందే ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సరస్వతీ నామాలు, సరస్వతీ మాత అనుష్టానం, జపం, పారాయణంచేశారు. అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరిస్తున్నారు.

Share post:

Popular