Mana Enadu : రోజురోజుకు టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ముప్పు కూడా పెరుగుతోందని టెక్ నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ సాయంతో సైబర్ కేటుగాళ్ల రోజుకో రకమైన మోసానికి (Cyber Crimes) పాల్పడుతున్నారు. విద్యావంతులు, ఉన్నతాధికారులు కూడా వీళ్ల వలలో చిక్కుకుంటున్నారంటే ఎంత పక్కాగా వీళ్లు ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాలుగా గాలం వేస్తూ.. ఏమాత్రం అనుమానం రాకుండా ఖాతాల్లో డబ్బును ఖాళీ చేసేస్తున్నారు.
సైబర్ మాయాజాలం ఇప్పుడు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది. చాలా వరకు కేసుల్లో వారు నిందితులను గుర్తించలేకపోతున్నారు. ఇక సైబర్ కేటుగాళ్లు సామాన్యులనే కాదు.. ప్రముఖుల్ని సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ భద్రత (Cyber Safety)పై ప్రజల్లో అవగాహన పెంచి మోసాల బారిన పడకుండా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి సైబర్ నేరాల బారిన పడుకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
ఇలాంటివి అస్సలు చేయొద్దు
- తెలియని వారు పంపిన లింకులు, వెబ్ సైట్ లలోని పాప్ అప్స్ ను అస్సలు క్లిక్ చేయొద్దు
- తెలియనివారికి ఓటీపీలు, క్రెడిట్, డెబిట్, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన సమాచారం ఇవ్వకూడదు.
- మీ స్నేహితులు, బంధువులు లేదా పై అధికారుల వాట్సాప్ డీపీలతో ఉన్న నంబర్ల నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దు. ఆ నంబరుకు కాల్ చేసి క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవాలి. వీలైతే నేరుగా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి.
- మీకు తెలియని చోట నుంచి వచ్చే ఈ-మెయిల్స్, అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయకూడదు.
- పోర్న్‌సైట్‌లు చూస్తున్నట్లుగా వచ్చే ఈ-మెయిల్స్/మెసేజ్‌లను అస్సలు నమ్మొద్దు.
- ఓపెన్/పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల జోలికి వెళ్లొద్దు.
- పార్ట్‌టైం జాబ్‌లు/వర్క్‌ఫ్రమ్ హోమ్ అని వచ్చే కాల్స్ , మెసేజ్ లకు రెస్పాండ్ అవ్వొద్దు.
మరేం చేయాలంటే?
- మీ అకౌంట్లకు స్ట్రాంగ్, పొడవైన, అర్థంకాని, గజిబిజి పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. తరచూ వాటిని మారుస్తుండండి.
- మీ సోషల్ మీడియా ఖాతాల్లో డేటా ప్రైవసీ సెట్టింగ్ యూజ్ చేసి ప్రైవేటుగా ఉంచుకోండి.
- వాడిన తర్వాత మీ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌లను లాక్ చేయండి
- మొబైల్ అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కాల్స్, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, మీడియా, లొకేషన్లకు యాక్సిస్ అనుమతించే ముందు ఆలోచించండి.
- మీరు వెబ్‌సైట్‌ను బ్రోజ్ చేసేటప్పుడు యూఆర్‌ఎల్‌లో https: ఉందా చెక్ చేసుకోండి.








