తెలంగాణలోని ఆర్జీయూకేటీ (RGUKT)లో నోటిఫికేషన్ విడుదలలో జాప్యంతో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చి దాదాపు 25 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు పదిలో మంచి మార్కులు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఇస్తామంటూ గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి వారి కాలేజీల్లో చేర్చకుంటున్నారు. ఆర్జీయూకేటీలో నోటిఫికేషన్ ఆలస్యమైతే మెరిట్ స్టూడెంట్స్ దూరమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆర్జీయూకేటీలో కోర్సులు ఇలా..
బాసరలో ( basara) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు లో తొలి రెండేళ్లు ఇంటర్ (ప్రీ యూనివ ర్శిటీ కోర్సు), మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కాలేజీలో అనేక సమస్యలు ఉన్నాయనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనికి తోడు వివిధ కారణాలను చూపుతూ ఆర్జీయూకేటీలో నోటిఫికేషన్ ప్రక్రియ జాప్యం చేస్తున్నారు. కరోనా మహమ్మరి రాక ముందు పదో తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల చేసేవారు.
కరోనా కంటే ముందు ఇలా..
కరోనా కంటే ముందు సంవత్సరాల్లో నోటిఫికేషన్ తొందరగానే ఇచ్చేవారు. 2019లో ఏప్రిల్ 28న నోటిఫికేషన్ (notification) వచ్చింది. 2024 సంవత్సరంలో మే 27 న వచ్చింది. ఇలా ఆలస్యంగా నోటిఫికేషన్ రావడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ లో ప్రైవేట్ కాలేజీల్లో చేరిపోతున్నారు. మెరిట్ స్టూడెంట్స్ చాలా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. గత విద్యాసంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ (andra pradesh) విద్యార్థులు 15 శాతం సీట్లకు పోటీ పడేవారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. దీంతో మొత్తం సీట్లు తెలంగాణకే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ విద్యార్థులకు ఈ విషయంలో మాత్రం లాభం చేకూరనుంది.






