Mana Enadu : రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి (telangana thalli) విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే విగ్రహావిష్కరణ కోసం బుధవారం రాత్రి సమయంలో విగ్రహాన్ని సచివాలయానికి తరలించారు. విగ్రహం కనిపించకుండా కవర్లతో కప్పేశారు.
తెలంగాణ తల్లి ఫొటో వైరల్
తాజాగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం (telangana thalli photo) ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం చాలా కళగా ఉంది. చేతిలో మొక్కజొన్న, వరికంకులు, మెడలో మూడు ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు నిండుగా ఆకట్టుకుంటోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె కవితను పోలి ఉందన్న విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద సచివాలయ అధికారులు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.
విగ్రహంలో బతుకమ్మ ఏది?
అయితే సోషల్ మీడియాలో తెలంగాణ తల్లి విగ్రహం ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి మెడలో ఆభరణాలున్నాయి కానీ అసలైన మంగళసూత్రం (తాళిబొట్టు) లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి, ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనకు ప్రతీక అయిన బతుకమ్మ (Bathukamma) కూడా ఈ విగ్రహంలో పొందుపరచలేదని మండిపడుతున్నారు.
కేసీఆర్ కు ఆహ్వానం
మరోవైపు డిసెంబరు 9వ తేదీన జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ తోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ కు కూడా ఆహ్వానం పంపుతామని వెల్లడించారు. దీనికోసం సమయం ఇవ్వాలని వారిని కోరామని చెప్పారు. నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరఫున ఆహ్వానం పంపిస్తామని పేర్కొన్నారు.






