Mana Enadu: నెల రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ‘‘హైడ్రా(Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency)’’ విశ్వరూపం చూపిస్తోంది. భాగ్యనగరం పరిధిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ తర్వాత ఆక్రమించుకుని కులుకుతున్న బడా బాబుల కూసాలు కదులుతున్నాయి. చెరువు శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్(Full Tank Level), బఫర్ జోన్ల లో ఆకాశాలను తాకే కట్టడాలు, మరీ ముఖ్యంగా ఫామ్ హౌజుల పేరిటా ఎకరాల మేర చెరువుల భూములను హస్తగతం చేసుకున్న స్థలాలను బలవంతుల చెర నుంచి స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నాయి. దీంతో మహానగరంలో ఎక్కడ చూసిన హైడ్రా ముచ్చటే, ఎవరిని కదిపినా హైడ్రా తాలూకు చర్చే నడుస్తోంది. తాజాగా దీని ప్రభావం పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోనూ ప్రకంకపనలు సృష్టిస్తోంది.
ప్రభుత్వ భూములు, పార్క్ భూములు ఇలా ఏవైనా కావొచ్చు తెలిసీతెలియక ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తోంది. మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణకు గురైన భూములను స్వతహాగా తిరిగి ఇవ్వాలని ఆ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఒకవేల అలాంటి వారు మిన్నకుండిపోతే ప్రభుత్వమే తిరిగి సొంతం చేసుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ(YCP) ప్రభుత్వ హయాంలో, జగన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ అస్తవ్యస్తంగా తయారైందని మండిపడ్డారు.
ఇవ్వకుంటే ఉపేక్షించేది లేదు..
అటు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో వార్నింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ఆక్రమణదారులు కబ్జా చేసిన భూములు, స్థలాలను తిరిగి ఇవ్వకుండా హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి చర్యలను ఉపేక్షించమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ హెచ్చరికలతో ఆక్రమణదారులు దారికొస్తారా? లేదంటే బుల్డోజర్లతో కూల్చేదాకా పరిస్థితి తీసుకొచ్చుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా హైడ్రా పవర్.. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుందనేది కాదనలేని నిజం