ManaEnadu:తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు (Telangana Heavy Rains) ప్రజలను బెంబేలెత్తించాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం రహదారులపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాగులు దాటేందుకు ప్రమాదకరంగా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రోజున ఉప్పొంగుతున్న వాగులను దాటేందుకు ప్రయత్నించి ఆయా జిల్లాల్లో 15 మంది మృతి (Flood Deaths In Telangana) చెందారు. ఈ ఘటనల్లో ఐదుగురికిపైగా గల్లంతయ్యారు. వారిని రక్షించేం పనిలో నిమగ్నమయ్యాయి రెస్క్యూ బృందాలు.
వరదలపై సీఎం సమీక్ష..
రాష్ట్రంలో సోమవారం రోజున వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు పునరావాస ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Review On Floods) మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోమంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వరద మృతులకు ఆర్థిక సాయం..
ఈ సమీక్షలో వరదల ప్రభావం గురించి చర్చించారు. బాధితులకు అండగా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.5 లక్షల (Flood Victims Exgratia)కు పెంచి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాలోని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని.. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలన్న రేవంత్.. చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం (Floods Compensation) పెంచాలని చెప్పారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలని వివరించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై చర్చించిన సీఎం.. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.