Mana Enadu:అప్పటిదాకా అంతా హాయిగా.. జాలీగా ఉంటుంది. ఒక్కసారిగా అనుకోని ప్రకృతి విపత్తో లేదా ఏదో ప్రమాదమో ముంచుకొస్తుంది. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా.. కళ్లముందు రక్తపాతం. అది చూసి స్పృహతప్పి పడిపోయే వాళ్లు కొందరు.. భయపడి పారిపోయే వాళ్లు ఇంకొందరు.. ఏం జరిగిందో అర్థంగాక.. కళ్లముందు చూస్తోంది నిజమో కాదో తెలియని అలాగే ట్రాన్స్ లో ఉండిపోయే వాళ్లు మరికొందరు. కానీ అలాంటి ప్రమాదం జరిగిన చోట ఒకడుంటారు. జరిగిన ప్రమాదాన్ని అంచనా వేసి.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని తన ప్రాణాలకు తెగించి కాపాడేవాడు. ఓవైపు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణం తలపిస్తున్నా.. ధైర్యంగా ముందుకెళ్లి తనకు చేతనైనంత మంది ప్రాణాలను రక్షిస్తాడు. ఇదంతా వింటుంటే ఏదో సినిమాలో సీన్ చూస్తున్నట్టు ఉంది కదూ.
కానీ అచ్చం ఇలాగే కేరళలో ఓ సంఘటన జరిగింది. ఇటీవల ఆ రాష్ట్రంలోని వయనాడ్ ప్రకృతి సృష్టించిన విలయానికి అతలాకుతలమైన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వారం రోజులుగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే 200 మంది ఆచూకీ గల్లంతయినా.. అందులో ఒకరి ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు అక్కడున్న వారిని కలవరానికి గురి చేస్తోంది. అయితే అతడు ప్రముఖుడో.. ఏ రాజకీయ నాయకుడో కాదు. ఓ సామాన్య వ్యక్తి. కానీ ప్రకృతి ప్రకోపం చూపించిన సమయంలో తానో సూపర్ హీరోగా మరాడు.

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడిన ఆ సూపర్ హీరోనే ప్రజీశ్. ఈ విపత్తులో ఎంతో మందిని కాపాడిన అతడి జాడ ఇప్పుడు తెలియడం లేదు. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను రక్షించిన వాడు ఇప్పుడు బతికున్నాడో లేదోనని వాళ్లు ఆవేదన చెందుతున్నారు. ఎలాగైనా అతడు క్షేమంగా ఉండేలా చూడు భగవంతుడా అంటూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.
వయనాడ్‌లోని చూరాల్‌మలకు చెందిన ప్రజీశ్ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియగానే, రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో జీప్‌లో వెళ్లారు. అలా రెండుసార్లు పలువురిని కాపాడి ఆ తర్వాత కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో సహాయం కోసం మరో ఫోన్ కాల్ వచ్చింది. మళ్లీ అదే ప్రాంతానికి జీప్‌లో వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. చూరాల్‌మల ప్రాంతంలో ధ్వంసమైన జీప్ కనిపించింది కానీ అతడి జాడ మాత్రం కానరాలేదు. ‘‘అతడు మా సూపర్ హీరో. ఇప్పుడతడు మా ముందు లేడు’’ అంటూ స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా అతడు బతికి ఉండాలని దేవుణ్ని వేడుకుంటున్నారు. అధికారులు కూడా అతడి జాడ కోసం వెతుకుతున్నారు.
Wayanad super hero missing, Wayanad landslide updates, Kerala tragedy updates, Wayanad rescuer prajeesh missing updates







