ManaEnadu : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ సోమవారం (నవంబరు 4వ తేదీ) జారీ కానుంది. ఇందు కోసం పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంవత్సరం టెట్ పరీక్ష రెండు సార్లు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహించింది.
జనవరిలో టెట్ పరీక్షలు
ఇక రెండో టెట్ కు నవంబరులో నోటిఫికేషన్ (TET Notification) ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలను జనవరిలో నిర్వహించనుంది. గత మే నెలలో నిర్వహించిన పరీక్షలను సుమారు 2.35 లక్షల మంది రాయగా.. 1.09 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
సంక్రాంతి లోపా? ఆ తర్వాతా?
ఈసారి డీఎస్‌సీ (Telangana DSC) కూడా పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నందున కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్ల సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నదానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని వెల్లడించారు.
ఏడాదిలోపే రెండోసారి టెట్
ఇక టెట్ పేపర్-1కు డీఈడీ (DED), పేపర్-2కు బీఈడీ (BED) పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలనే రూల్ ఉండటంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా…జనవరిలో పదోసారి జరగనుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.






