Mana Enadu : దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. దీపాలతో తమ ఇళ్లను దేదీప్యమానంగా వెలుగు వెదజల్లేలా అలంకరించారు. ఇక పిల్లలంతా కలిసి సరదాగా టపాసులు కాల్చారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అల్లరి చేష్టలతో ప్రయాణికులను ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.
బైకులపై బాణాసంచా ఫైరింగ్
హైదరాబాద్ మహా నగరంలో దీపావళి పండుగ వేళ కొంతమంది ఆకతాయిలు చేసిన పనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైటెక్ సిటీ (Hi Tech City) ప్రాంతంలో కొందరు యువకులు ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ బైక్‌లపై విన్యాసాలు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఆకతాయిల వికృతానందం
ఈ వీడియో కాస్త టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) దృష్టికి చేరింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగపూట ఇదేం వికృతానందం అని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఆ ఆకతాయిలు ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఆనందం కోసం ఇలా ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటారా? అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ఇదేం వికృతానందం
‘దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం. ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆయన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. ఈ చేష్టలతో మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ట్వీట్లు చేశారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం.
దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం.
పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR
— Office of V.C. Sajjanar, IPS (@SajjanarOffice) November 3, 2024






