పాకిస్థాన్కు గూఢచర్యం (spying for pakistan) చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న వారి చిట్టా బయటపడుతోంది. శత్రు దేశానికి గూఢచర్యం చేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాగాజా అరెస్ట్ చేశారు. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేశ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు అందించినట్లు గుర్తించారు.
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై గూఢచర్యం
మహారాష్ట్ర థానేలోని కల్వానికి చెందిన రవీంద్ర వర్మ(27) మెకానికల్ ఇంజినీర్. ఓ రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడికి దక్షిణ ముంబయిలోని నావల్ డాక్‌యార్డ్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది. నావల్ షిప్‌లు, సబ్‌మెరైన్లలో కూడా ప్రయాణించవచ్చు. ఈ నేపథ్యంలోనే 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే పాకిస్థాన్ ఏజెంట్లతో రవీంద్ర వర్మకు ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయమైంది. ఆ ఏజెంట్లు తాము భారత్‌కు చెందినవారమని పరిచయం చేసుకున్నారు. కొద్ది రోజులు వారి మధ్య సంభాషణలు సాగాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాజెక్టు విషయంలో యుద్ధనౌకల సమాచారం కావాలని వర్మను కోరారు. దీంతో అతడు భారత్‌కు చెందిన యుద్ధనౌకల నుంచి, సబ్‌మెరైన్లకు సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేశారు.
కోర్టులో హాజరుపరచగా….
ఇందుకు గానూ అతడికి భారీగా డబ్బులు అందాయి. అతడి బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బు జమయ్యింది. అయితే వర్మకు వారు పాక్ ఏజెంట్లు అని తెలిసినా దేశ రక్షణ వివరాలను పంచుకున్నాడని అధికారులు పేర్కొంటున్నారు. నిందితుడు ఆ సబ్‌మెరైన్, (submarines) యుద్ధనౌకల (warships) పేర్లను కూడా పాక్ ఏజెంట్లతో పంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నావల్ డాక్‌యార్డ్‌లోకి ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. దీంతో అతడు అక్కడి విషయాలను స్కెచ్‌ల రూపంలో పంచుకునేవాడు. మరికొన్నిసార్లు ఆడియో నోట్స్‌ను వినియోగించాడు. వర్మను కోర్టులో హాజరుపరచగా.. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ కస్టడీకి అప్పగించింది. అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.






