ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ తో దేశం అంతా ఏకమైందని ప్రధాని మోదీ (PM Modi) మన్ కీ బాత్ లో అన్నారు. మన్ కీ బాత్ (Mann Ki Baat) 122వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలతో ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సిందూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో దేశంలోని అందరూ ఒకే కుటుంబంలా మారారన్నారు.
నవభారత నిర్మాణానికి ప్రతీక
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తర్వాత పుట్టిన అనేక మంది పిల్లలకు దేశంలో సిందూర్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం ప్రతి భారతీయుడు మెదడులో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉంది. అదే సంకల్పంతో ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది సైనిక చర్య మాత్రమే కాదు. దేశ ఐక్యతకు నవ భారత నిర్మాణానికి ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోని అన్ని పట్టణాలు, గ్రామాలు తిరంగా యాత్రలు నిర్వహించాయి. ఇందులో కుల, మత భేదాల తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. దేశంలో పౌర రక్షణ వాలంటీర్లుగా రమ్మని ఇచ్చిన ఒక్క పిలుపుతో ఎంతో మంది యువత స్వచ్ఛందంగా ముందుకు కదలివచ్చారు. దీంతో భారత్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరూ ఏకతాటిపై నిలబడతారని నిరూపించారని కొనియాడారు.
నక్సలిజం నిర్మూలిస్తాం
దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసం వీరోచితమైందన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు.
నక్సలిజం నిర్మూలనలో విజయం సాధించబోతున్నామన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో వ్యవసాయంలో డ్రోన్లను (farming with drones) ఉపయోగిస్తూ పంటలు పండిస్తున్న సంగారెడ్డి (Sangareddy) మహిళలను ప్రశంసించారు.






