Mana Enadu : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 సినిమా (Pushpa 2 Benefit Show) బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు (Sandhya Theatre Case) దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్టు చేయగా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయణ్ను మరోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు.
ప్రధాన నిందితుడి అరెస్టు
పోలీసుల నోటీసులు అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun Case) ఇవాళ చిక్కడపల్లి ఠాణాకు వెళ్లారు. మూడున్నర గంటలపాటు ఆయణ్ను పోలీసులు విచారించారు. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక అడుగు ముందుకు పడింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన వారిలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆంటోనీ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయణ్ను అరెస్ట్ (Sandhya Theatre Case A1 Arrest) చేశారు. ఆంటోనీ బౌన్సర్లకి ఆర్గనైజర్‌గా పనిచేస్తాడని సమాచారం.
20కు పైగా ప్రశ్నలు
మరోవైపు చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ (Allu Arjun Inquiry) విచారణ పూర్తయింది. మూడున్నర గంటలపాటు బన్నీని అధికారులు దాదాపు 20కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అయితే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు మీకు తెలుసా.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది.. వంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని సమాచారం.






