కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Tirumala Srivari Darshan) వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఇవాళ (ఆగస్టు 6) శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా TTD చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కంపార్టుమెంట్ల వెలుపల కూడా భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.

శ్రీవారి హుండీ కానుకలు రూ. 3.71 కోట్లు
ఇక నిన్న(ఆగస్టు 5) తిరుమల శ్రీవారిని 72,951భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 27,143 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ కానుకలు రూ. 3.71 కోట్లుగా ఉంది. తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు త్వరలో ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.






