
సింధూ జలాల (Indus Waters) పై అస్సలు రాజీపడే ప్రసక్తే లేదని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ (Pakistan Army Chief Asif Munir) మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్ల సమావేశంలో ఆసిప్ మునీర్ ప్రసంగించారు. 24 కోట్ల మందికి ప్రాథమిక హక్కు సింధు జలాలు, దానిపై ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఎలాంటి ఒప్పందాలు కూడా సాధ్యం కావని కశ్మీర్ ను ఎప్పటికీ మరిచిపోయే ప్రసక్తే లేదని అన్నారు.
బలూచ్ లో విదేశీయులే వేర్పాటు వాదులు
బలూచిస్తాన్ లో ( Balochistan) వేర్పాటు వేదం అనేది పూర్తిగా విదేశీయులు చేస్తున్నదే అని అన్నారు. పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ 1960ల నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ నేతలు భారత్ పై తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి ప్రతి దాడి ఎదురుకావడం, సింధూ జలాల నిలిపివేత, ఎయిర్ బేస్ లపై దాడులతో పాక్ లో అలజడి నెలకొంది. అయినప్పటికీ అక్కడి ఆర్మీ చీఫ్ మేకపోతు గాంభీర్యం చూపిస్తూనే ఉన్నాడు.
ఒప్పందం జరిగిందిలా..
సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో 1960 సెప్టెంబర్ లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సింధు ఉప నదుల్లో రావి, బియాస్, సట్లెజ్ (Sutlej) నదులపై పూర్తి హక్కులు భారత్ కు, పశ్చిమ ఉపనదులైన సింధూ, జీలం, చీనాబ్ లపై పాకిస్థాన్ కు హక్కులు దక్కాయి.