ప్రస్తుతం గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.900కు పైగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తూ పేదలకు ఆర్థిక ఊరటనిస్తోంది. అయితే, పలు జిల్లాలో అనేక మంది లబ్ధిదారులకు ఈ సబ్సిడీ రాయితీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో తమకు సబ్సిడీ రాకపోవడానికి అసలు కారణం తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు చెబుతున్న సమాచారం మేరకు మీ గ్యాస్ సబ్సిడీ ఎలా అందుకోవాలో ఇప్పుడు చూద్దాం..
సబ్సిడీ రాకపోవడానికి ముఖ్యమైన కారణాలు:
లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ జమ కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రజా పాలన కార్యక్రమాల్లో లేదా మీ సేవా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం ఒకటి. బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్, గ్యాస్ కనెక్షన్ వివరాలు, IFSC కోడ్ లేదా పేరు స్పెల్లింగ్‌లో పొరపాట్లు జరగడం వల్ల సబ్సిడీ జమ కావడంలో అంతరాయం కలుగవచ్చు.
అలాగే, కొంతమంది లబ్ధిదారులు రెండు వేర్వేరు గ్యాస్ ఏజెన్సీల వద్ద కనెక్షన్లు కలిగి ఉండటంతో, అవి డూప్లికేట్ కనెక్షన్లుగా పరిగణించబడుతున్నాయి. ప్రతి కుటుంబానికి ఒకే సబ్సిడీ కనెక్షన్ ఉండాలన్న నిబంధన కారణంగా ఇలాంటి ఇలాంటి వారికి రాయితీ నిలిచిపోయే అవకాశం ఉంది.
ఈ-కేవైసీ లోపాలు:
రేషన్ కార్డు ఈ-కేవైసీ చేయకపోవడం కూడా మరో ప్రధాన సమస్య. గ్యాస్ కనెక్షన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు ఇవన్నీ ఒకే వ్యక్తి పేరు మీద అనుసంధానమై ఉండకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో పాటు, లబ్ధిదారులు తప్పు మొబైల్ నంబర్లు నమోదు చేయడం వల్ల OTP రాకపోవడం, అవసరమైన సమాచారం అందకపోవడం జరుగుతోంది. ఇది కూడా సబ్సిడీ జమ ప్రక్రియకు అడ్డంకి అవుతోంది.
లబ్ధిదారులకు అధికారుల సూచనలు:
ఈ సమస్యలను ఎదుర్కొంటున్న లబ్ధిదారులు తక్షణమే తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. LPG రాయితీ పథకానికి సంబంధించి పూర్తి లబ్ధి పొందాలంటే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు వంటి అన్ని వివరాలు సక్రమంగా అనుసంధానమై ఉన్నాయో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా లోపాలుంటే సమీప మీ సేవా కేంద్రాల్లో లేదా గ్యాస్ ఏజెన్సీల వద్ద అవసరమైన పత్రాలతో సరి చేసుకోవాలని సూచించారు. ఇలా చర్యలు తీసుకుంటే మాత్రమే సబ్సిడీ నిరంతరాయంగా లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.







