మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల (CMR College Incident) హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డు చేశారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
మూడ్రోజులు హాలిడేస్
అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించి పరిశీలిస్తోంది. మరోవైపు ఈ ఘటన (CMR College Bathroom Videos Case) నేపథ్యంలో కాలేజీకి యాజమాన్యం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో హాస్టల్ నుంచి చాలా మంది విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లారు. మరోవైపు ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు
హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి తమను వీడియో (cmr college hidden camera case) తీశారంటూ మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఐటీ క్యాంపస్ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వారికి మద్దతుగా ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ వంటి పలు విద్యార్థి సంఘాలు, బీజేవైఎం నేతలు ముందుకు రావడంతో గురువారం రోజున పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది.







