కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన సినిమా థగ్ లైఫ్ (Thug life). త్రిష, శింబు, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న పలు భాషల్లో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ.. ‘దర్శకుడు మణిరత్నం ఈ సినిమాతో అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ఇంకా విద్యార్థినే. నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి’ అని అన్నారు. తాను మణిరత్నం సినిమాలో యాక్ట్ చేయనని, జస్ట్ బిహేవ్ చేస్తానని అన్నారు. నాజర్, తనికెళ్ల భరణి లాంటి యాక్టర్లతో ఇంకా కలిసి వర్క్ చేయాలని ఉందని పేర్కొన్నారు.
నాయకుడు కంటే పెద్ద విజయం సాధిస్తుంది..
‘నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. థగ్ లైఫ్ మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. ఇది ఒక ఫెంటాస్టిక్స్ టీమ్తో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే మూవీ. ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా నాయకుడు కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామిస్. నేను తెలుగులోనే స్టార్గా ఎదిగాను. స్టార్గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. జూన్ 5న మూవీ వస్తోంది. చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం’ అని అన్నారు.
అలా ఈ సినిమా మొదలైంది..
డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) మాట్లాడుతూ.. ‘కమల్తో ఫస్ట్ టైం నాయకుడు సినిమా చేశాను. మౌనరాగం పూర్తయిన తర్వాత నిర్మాత ముక్తా శ్రీనివాసన్ గారు వచ్చి ఒక హిందీ సినిమా క్యాసెట్ చేతిలో పెట్టి తమిళ్లో చేయాలని చెప్పారు. నాకు రీమేక్ చేసే ఉద్దేశం లేదని చెప్తే ఆ మాట కమలహాసన్తో చెప్పమన్నారు. నేను వెళ్లి ఆయనకు అదే చెప్పాను. అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ సినిమా చేద్దామని అని చెప్పారు. అలా నాయకుడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలానే జరిగింది. కాల్ చేసి ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామన్నారు. అలా ఈ మూవీ జర్నీ మొదలైంది. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.
పవన్ ఓజీలో పాడిన పాట త్వరలో రాబోతోంది
హీరో శింబు (Simbu) మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ నాకు చాలా స్పెషల్. నా బిగినింగ్ కెరియర్లో మన్మథ సినిమాకి తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోలేను. ఒజీలో నేను పాడిన పాట త్వరలో రాబోతుంది. పవన్ కల్యాణ్ గారి కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్. కమల్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్’ అని అన్నారు.






