
కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి(Tirumala Tirupati Venkateswara Swamy) భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ ఆర్జిత సేవా టికెట్ల(Arjitha Seva Tickets)ను రేపు (ఫిబ్రవరి 18) విడుదల చేయనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నుంచి ఈనెల 24వ తేదీ వరకు ఆన్లైన్‌లో శ్రీవారి దర్శన, వివిధ సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. తొలుత మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీడిప్(LuckyDip) ద్వారా కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నట్లు వెల్లడించారు.
అందుబాటులో వివిధ సేవల టికెట్లు ఇలా..
అలాగే ఈనెల 21న ఉదయం ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. అలాగే మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్ సేవా టికెట్లు(Virtual Service Tickets) విడుదల చేసేందుకు TTD షెడ్యూల్ విడుదల చేసింది. దీంతోపాటు ఈనెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనుండగా.. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు(Srivani Darshan Tickets) విడుదల కానున్నాయి. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు TTD ప్రకటించింది. ఇక 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానుండగా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.