
ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం అనేక డిజిటల్ పథకాలు, ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెడుతోంది. టోల్ ప్లాజా(Toll Plazas)ల వద్ద రద్దీ నివారించేందుకు ఫాస్టాగ్(fastag) వ్యవస్థ, డిజిటల్ టోలింగ్ వంటి చర్యలు చేపట్టింది. అయితే తాజాగా లూజ్ ఫాస్టాగ్‌ల వాడకాన్ని నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం, వాహన విండో షీల్డ్‌పై శాశ్వతంగా అతికించకుండా, టోల్ గేట్ల(Toll Gate) వద్ద వ్యక్తిగతంగా చూపించే లూజ్ ఫాస్టాగ్‌లు బ్లాక్‌లిస్ట్ చేయబడతాయని ప్రకటించింది. ఈ తరహా ట్యాగ్‌ల వాడకం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరగడం, వ్యవస్థలో జాప్యం, దుర్వినియోగం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
NHAI తెలిపిన ప్రకారం, ప్రతి వాహనదారుడూ( Vehicle Owners) తమ ఫాస్టాగ్‌ను వాహనంలోని windshieldపై సరిగా అతికించాల్సిందే. అయితే కొందరు డ్రైవర్లు ట్యాగ్‌ను హ్యాండ్‌లో ఉంచుకుని చూపిస్తూ టోల్ గేట్ల వద్ద చెలామణీ చేస్తున్నారు. దీని వల్ల రద్దీ పెరిగి రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయంగా మారుతోందని గుర్తించారు. అందుకే ఇటువంటి ఫాస్టాగ్‌లను వెంటనే నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవలే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రూ. 3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్‌ల జారీ ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ చర్యలతో టోల్ సిస్టమ్ మరింత సమర్థవంతంగా మారనుంది. వాహనదారులు సకాలంలో తమ ఫాస్టాగ్‌లను వాహనానికి సరిగ్గా అమర్చుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు