టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్(Fish Venkat) ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం(Critical Condition)తో పోరాడుతున్నారు. సినీ పరిశ్రమలోకి ‘సమ్మక్క సారక్క’ సినిమాతో అడుగుపెట్టిన ఆయన, ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు లభించగా, చివరిసారిగా ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ అనే చిత్రంలో కనిపించారు.
గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్, గతంలో డయాలసిస్ చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం కొంత మెరుగుపడినప్పటికీ, మళ్లీ పరిస్థితి విషమించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను, పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతం ఆపస్మారక స్థితిలో ఉన్నారని.. మనుషుల్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వైద్యులు, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కిడ్నీ మార్పిడి చేయడానికి సాయం కావాలని కోరుతోంది. గతంలో ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం కావడంతో, దాతలు ఎవరికైనా వీలైతే ముందుకు వచ్చి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.






