పాఠశాల విద్యాబోధనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు వృత్యంత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2024లో పదోన్నతులు పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, సాంఘిక శాస్త్రము, వ్యాయమ విద్య పాఠశాల సహాయకులకు రెండురోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ ఖమ్మం నగరంలో ప్రారంభమైంది.
శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్, ఇంఛార్జి జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ కోర్స్ డైరెక్టర్ గా.. అర్బన్ మండల విద్యాధికారి శైలజ లక్ష్మి కోర్స్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, NSC కాలనీ వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల- ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుల శిక్షణను జిల్లా విద్యాశాఖాధికారి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా బోధనా సిబ్బందికి.. సిలబస్, బోధన, మూల్యాంకనంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా విధానాలను మెరుగుపరుచుకుని జిల్లా విద్యావవస్థను సమర్ధవంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ రెండు రోజుల శిక్షణలో రిసోర్సు పర్సన్స్ బోధించే అంశాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకొని తమ పాఠశాలల్లో బోధనా ప్రక్రియలో వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మోనిటరింగ్ అధికారి కేశవపట్నం రవికుమార్, సెంటర్ ఇన్చార్జిస్, రిసోర్సు పర్సన్స్ పాల్గొన్నారు.






