Mana Enadu : శబరిమల అయ్యప్ప (Sabarimala Temple) భక్తులకు అలర్ట్. ఇరుముడికట్టు విషయంలో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇరుముడికట్టులో కర్పూరం, అగరబత్తీలు, రోజ్‌వాటర్ తీసుకురావొద్దని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై సర్య్కులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
వాటికి అనుమతి లేదు
కొచ్చి, మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు. కర్పూరం, అగరబత్తీలు పూజా సామగ్రి అయినా.. వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సన్నిదానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.
అందుకే ఈ కొత్త ప్రతిపాదన
దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయని .. వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని నివారించేందుకే దేవస్వమ్ బోర్డు (Devaswam Board) ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు వివరించారు. ఆలయ ప్రధాన పాలకుడు(తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరబత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వామ్ బోర్డుకు లేఖ రాయగా.. బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
స్పాట్ బుకింగ్ పై క్లారిటీ ఇదే
మండల పూజల సమయంలో శబరిమల (Sabarimala Spot Bookings) దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్స్ పై దేవస్వమ్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని .. అందుకోసం భక్తుల వద్ద తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని తెలిపింది. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.






