Mana Enadu : భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై (Jasprit bumrah) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్తమ బౌలర్ అని ప్రపంచ క్రికెట్ అతడిని కొనియాడుతోంది. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు తామే గొప్ప అని భావిస్తుంటారు. ఇతరులను పొగిడేందుకు ఇష్టపడరు. కానీ ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మాత్రం బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ లో ఉన్న గొప్ప ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ఒకరిగా నిలుస్తాడని కొనియాడాడు. అతడిని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నాడు. ఇది తన కెరీర్‌లో గర్వంగా చెప్పుకోదగిన విషయమని, తన మనవళ్ళు, మానవరాళ్లకు బుమ్రా గురించి చెబుతాను అని హెడ్ పేర్కొన్నాడు.
బుమ్రాను ఎదుర్కోవడం పెద్ద సవాలే
హెడ్ ((Travis Head) మాట్లాడుతూ, ‘బుమ్రాను ఎదుర్కోవడం ప్రతి బ్యాటర్‌కు పెద్ద సవాలే. అతను బ్యాటర్లను బలహీనంగా చేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. అతనితో పోటీ పడటం నా కెరీర్‌లో ముఖ్యమైన సంఘటనలలో ఒకటి’ అన్నాడు. ‘మా జట్టు ప్రతికూల పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము సవాళ్లకు ఎదురు నిలిచి విజయాలు సాధించాం. పెర్త్ మ్యాచ్‌లో ఓడిపోయినా, మిగిలిన సిరీస్‌లో మేము మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తాం’అని హెడ్ పేర్కొన్నాడు.
ఆసీస్ నడ్డి విరిచిన బుమ్రా..
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (border gavaskar trophy) భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ బౌలర్లకు బుమ్రా చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల అద్భుత ప్రదర్శనతో కంగారూ బ్యాటర్లను మట్టికరిపించాడు. టీమిండియాను విజయతీరాలకు చేర్చిన బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బుమ్రా ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. భారత జట్టుకు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.






