
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Telangana Phone Tapping Case) వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్రిపుర గవర్నర్ (Tripura Governor) నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తాజాగా బహిర్గతమైంది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ జి.నర్సింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(SIB) కేంద్రంగా ట్యాప్ చేసినట్లు తేలింది. రెండ్రోజుల క్రితం నర్సింహులును హైదరాబాద్ పోలీసులు పిలిచి విచారించారు. అధికారులు చెప్పే వరకు ఈ విషయం తనకు తెలియదని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.
త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్
ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) 2014 నుంచి తన OSD పేరిట ఉన్న ఫోన్ నంబరునే వినియోగిస్తున్నట్లు సమాచారం. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ నంబరును ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు టీమ్ ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నంబరును ట్యాప్ చేయాలని ఎస్ఐబీని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారిస్తేనే తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన తమిళి (Tamilisai Soundararajan)సై ఫోన్‌నూ ట్యాప్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
అందుకే ట్యాపింగ్
2023 అక్టోబరు 26న త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా పని చేశారు. ఇంద్రసేనారెడ్డి పార్టీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండటంతో కేంద్రంలోని కీలక రహస్యాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.