తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన వారు వ్యవహరించాల్సిన తీరుపై తాజాగా ఓ తీర్మానం చేసింది. ఇక నుంచి తిరుమల (Tirumala Temple) కొండపై రాజకీయ ప్రసంగాలు చేయకూడదనే నిబంధనను నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి (Tirumala Srivaru) దర్శనానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని.. పూజలు చేస్తుంటారు. తిరుమల కొండపై ఏదో తెలియని ఓ ప్రశాంతత దొరుకుతుందని చాలా మంది భక్తులు చెబుతుంటారు. అలాగే కొండపైన నిత్యం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామి దర్శనానికి వచ్చిన కొందరు రాజకీయ ప్రముఖులు అసందర్భంగా.. రాజకీయ ప్రసంగాలు చేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలు
శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలు (Political Speeches), విమర్శలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానంతరం మీడియా ఎదుట కొంతమంది నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనిపై చాలా రోజులుగా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ విషయంపై టీటీడీ (TTD) చర్యలు చేపట్టింది.
ఆ ప్రసంగాలపై నిషేధం
తిరుమల పవిత్రతను, కొండపైన భక్తుల ప్రశాంతతను కాపాడేందుకు ఈ విషయంలో తాజాగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల తీర్మానం చేసిన బోర్డు.. నేటి నుంచి ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. టీటీటీ తాజా నిర్ణయంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






