Mana Enadu : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల (Tirumala Temple)కు వెళ్తుంటారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ప్రతి రోజు తిరుమల సన్నిధిలో భారీగా రద్దీ నెలకొంటుంది. ఫలితంగా స్వామి దర్శనానికి గంటల పాటు క్యూ లైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు తీపి కబురు అందించారు.
శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనే ఆలోచన
ఇక నుంచి భక్తులు గంటలోనే శ్రీవారి దర్శనం (Tirumala Darshan) చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. ఎక్కువ సేపు కంపార్టుమెంట్లలో ఉండటం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే గంటలోపు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలనేది తన ఆలోచన అని వెల్లడించారు. మరోవైపు శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) రద్దు చేయాలనేది తన మరో ఆలోచన అని చెప్పారు. గతంలో ఉన్న టైమ్ స్లాట్ పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని.. మెటీరియల్ సరఫరా, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని ఆయన పేర్కొన్నారు.
సొంత డబ్బుతో తిరుమలకు సేవ
టీటీడీ ఛైర్మన్ (TTD New Chairman) గా నియామకమైన తర్వాత ఆయన తొలిసారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటానని.. స్వామీజీలతోనూ పరిచయాలున్నాయని చెప్పారు. సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అందరినీ కోరుతున్నానని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు.






