Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Temple) దర్శనానికి ప్రతి రోజు ప్రపంచ నలుమూలల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు. అయితే వెంకన్న నివేదనకు ఎన్ని రకాల ప్రసాదాలు తయారవుతున్నా.. తిరుమల లడ్డూలకు మాత్రం ఎందుకో చాలా స్పెషాలిటీ ఉంటుంది.
లడ్డూ ముఖ్యం బిగిలూ
అందుకే.. ఎవరైనా తిరుమల వెళ్తున్నామంటే.. లడ్డూలు(Tirumala Laddu) ముఖ్యం బిగులు అన్నట్టు.. తప్పకుండా లడ్డూ ప్రసాదం తీసుకురావాలని చెబుతుంటారు. ఇక ఎవరైనా తిరుమల వెళ్లొచ్చాం అని చెబితే.. దర్శనం బాగా జరిగిందా అనే ప్రశ్నకంటే ముందు శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చారా? అన్న ప్రశ్నే ఎదురవుతుంది. తిరుమలేశుడి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యతేంటో ఇది చూస్తే అర్థమైపోతుంది. అయితే ఇన్నాళ్లూ తిరుమల స్వామి దర్శనం అనంతరం భక్తులకు పరిమిత సంఖ్యలో మాత్రమే లడ్డూలు అందజేసేవారు. కానీ ఇప్పుడు ఆ రూల్ మారబోతోంది. ఇక నుంచి భక్తులకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారట. దీనిపై టీటీడీ(TTD) ఏం చెబుతోందంటే..?
పోటు సిబ్బంది నియామకం
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Laddu) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం అదనంగా లడ్డూలు తయారు చేయించాలని ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలోనే లడ్డూల తయారీకి అవసరమైన “పోటు” సిబ్బంది నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది.
రోజూ 3.5 లక్షల చిన్న లడ్డూల తయారీ
టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు (Kalyanam Laddu), 3,500 వడలు తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుమలతోపాటు హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులకు ప్రస్తుతం ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు సరాసరి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటే 70 వేల ఉచిత లడ్డూలు అందివ్వాల్సి వస్తోంది.
అదనపు లడ్డూల కోసం పోటు సిబ్బంది నియామకం
ఇవే కాకుండా భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల (Tirumala Bramhotsavam) సమయంలో లడ్డూలకు భారీగా డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అదనంగా మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయించిన టీటీడీ .. ఇందుకోసం అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో 10 మంది శ్రీవైష్ణవులు కాని వారిని సిబ్బందిగా నియమించాలని నిర్ణయించింది. సిబ్బంది నియామకం పూర్తైన తర్వాత భక్తులకు వారు అడిగనన్ని లడ్డూలు లభించనున్నాయి.