ManaEnadu : తిరుమల శ్రీవారి (Tirumala Temple) భక్తులకు అలర్ట్. దర్శన టికెట్ల విషయంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత ఈజీ చేసింది. ఇక నుంచి గోకులం సమావేశ మందిరం వెనుక వైపున ఏర్పాటు చేసిన కౌంటర్ లో శ్రీవాణి దర్శన టికెట్లు (Srivani Offline Tickets) కొనుగోలు చేయొచ్చు. ఈ నూతన కౌంటర్‌ను బుధవారం రోజున ఏఈవో ప్రారంభించారు.
ఈజీగా శ్రీవాణి దర్శన టికెట్లు
గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడేవారు. అది గుర్తించిన టీటీడీ తాజాగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి.. కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటరులో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని ఏఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి భక్తులు (TTD Srivani Tickets) ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని తెలిపారు. ప్రతి రోజూ 900 శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీవారి సన్నిధిలో కైశిక ద్వాదశి వేడుక
మరోవైపు తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం(Tirumala News Today)లో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా ఘనంగా నిర్వహించారు. ఇవాళ వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.






