ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) పాక్ రాయబారి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అందువల్లే సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
దశాబ్ధాలుగా టెర్రరిజంతో బాధపడుతున్నాం
2008 ముంబై లో టెర్రర్ ఎటాక్, గత నెల పహల్గాం టెర్రర్ దాడులు చేసింది పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో శిక్షణ పొందుతున్న వారేనని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులకు కేంద్రంగా ఇస్లామాబాద్ పని చేస్తోందని మండిపడ్డారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ టెర్రరిజంతో (Pakistan terrorism) బాధపడుతుందన్నారు. ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో దాదాపు 20 వేల మంది భారతీయులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా ఉందని దుమ్మెత్తి పోశారు. అలాంటి పాకిస్థాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
సీమాంతర ఉగ్రవాదం ఆపితేనే..
పాక్ దేశ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) ఉపసంహరణ అంశం గురించి ప్రస్తావించారు. ‘నీరు ఎంతో మంది జీవితాలకు ఆధారమని, యుద్ధానికి ఆయుధం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకు సింధూ నది జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ తేల్చి చెప్పారు. అసలు పాకిస్థాన్ కు ఉగ్రవాదం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదన్నారు.







