జమ్మూ కశ్మీర్ లో (Jammu and Kashmir) ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఉదంపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఇద్దరు పోలీసులు బుల్లెట్ గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా దీన్ని అనుమానాస్పద మృతి గా భావిస్తున్నారు. ఉదయం 6.30 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కాళీ మాత ఆలయం (kali matha temple) వెలుపల పోలీసు వ్యానులో బుల్లెట్లు శరీరంలోకి వెళ్లిన డెడ్ బాడీస్ కనిపించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను పోస్టు మార్టానికి తరలించారు. కాగా ఇందులో టెర్రర్ ఎటాక్ ఎలాంటిది లేదని కేవలం ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు.
పరస్పరం కాల్చుకుని..
ఎన్ఎస్ పీ ఉదంపూర్ (udhampur) ఆమోద్ నాగ్ ఫురే మాట్లాడుతూ.. ఉదంపూర్ కాళీమాత టెంపుల్ రహమ్ బాల్ ప్రాంతంలో పోలీసులు ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారన్నారు. ఈ ఘటనలో ఏకే 47 రైఫిల్ (ak 47) ఉపయోగించినట్లు రుజువైందన్నారు. అక్కడే ఉన్న మరో పోలీసు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మూడో వ్యక్తి సురక్షితంగా ఉండటంతో ఇది కేవలం ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ అని తెలుస్తుందన్నారు. అయితే వీరిద్దరు పరస్పరం కాల్చుకుని చనిపోవడానికి గల కారణాలు ఏమిటనే విషయం ఇంకా తెలియలేదు. ఇద్దరి మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేక పాత గొడవలతో ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డారా అనేది విచారణలో తేలనుంది. జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ (udham pur) చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఇద్దరు పోలీసులకు ఇలా చేసుకోవడంతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. వీరి మృతికి గల కారణాల గురించి అన్వేషిస్తున్నారు.






