Mana Enadu : విద్యార్థులకు కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది. పీఎం-విద్యాలక్ష్మి (PM Vidyalaxmi scheme) పథకానికి బుధవారం (నవంబరు 6వ తేదీన) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రూ.7.50 లక్షల రుణం
ఈ నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం-విద్యాలక్ష్మీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ పథకం (PM Vidya Laxmi Scheme Eligibility) ద్వారా దేశ వ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రూ.7.50 లక్షల వరకు రుణం లభిస్తుందని తెలిపారు. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని వెల్లడించారు.
22 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
ఎఫ్‌సీఐలో మూలధన అవసరాలకు రూ.10,700 కోట్లను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇది సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ అని తెలిపారు. పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.
వారే ఈ పథకానికి అర్హులు
రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు అని కేంద్ర మంత్రి తెలిపారు. రూ.10లక్షల వరకు రుణాల (Student Loans)పై రూ.3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్ లబ్దిదారులు ఈ పథకానికి అనర్హులు అని.. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు.






