Mana Enadu : ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK S4) అనే టాక్ షోను హోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రతి వారం ఓ గెస్టుతో అలరిస్తున్న ఈ షోలో తాజాగా విక్టరీ వెంకటేశ్ (Venkatesh) సందడి చేశారు. సంక్రాంతి పండుగ స్పెషల్ గా వస్తున్న ఈ ఎపిసోడ్ లో వెంకటేశ్ తో పాటు ఆయన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్ కూడా సందడి చేసింది. సంక్రాంతి హీరోలు అనే టైటిల్ తో వస్తున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’ తో బాలకృష్ణ, ‘సంక్రాంతికి వస్తున్నాం (sankranthiki vasthunam)’తో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంక్రాంతి హీరోలు అనే టైటిల్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రావడం నెటిజన్లను ఖుష్ చేస్తోంది. ఈ ప్రోమోలో బాలయ్య, వెంకీల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. టాలీవుడ్ కు నాలుగు పిల్లర్లు అయిన చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున గురించి ఈ సందర్భంగా బాలయ్య ప్రస్తావించారు.
ఇక తమ నలుగురిలో రాముడు మంచి బాలుడు అనే ట్యాగ్ వెంకీకే ఇచ్చినట్లు బాలయ్య చెప్పగా.. హేయేయ్ ఎవరి గురించి చెబుతున్నావ్ అంటూ వెంకటేశ్ మధ్యలో బాలయ్యను ఆటపట్టించారు. ఇక ఈ ఎపిసోడ్ లో వెంకీ తన కూతుళ్లను కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత వెంకటేశ్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా వారి తండ్రి, మూవీ మొఘల్ రామానాయుడి గురించి బాలయ్య ప్రస్తావించిన సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.
ఇక తర్వాత బాలయ్య, వెంకీ ఒకరి డైలాగ్స్ ను మరొకరు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. ప్రోమో చాలా జోవియల్ గా సాగుతున్న సమయంలో ఎపిసోడ్ లో కి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎంట్రీ ఇచ్చి మరింత సందడి తీసుకొచ్చారు. బాలకృష్ణ, వెంకటేశ్ లతో కలిసి పెళ్లికళ వచ్చేసిందే బాలా అనే పాటకు స్టెప్పులేశారు. సంక్రాంతి సందడి అంతా ఈ ప్రోమోలోనే కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ప్రోమోను మీరూ ఓసారి చూసేయండి.






