బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు (Bangladesh riots) జరుగుతుండగా దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు (US Secretary of State) జేక్ సలివన్ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)తో మాట్లాడారు. ఈ మేరకు అగ్రరాజ్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘మానవ హక్కులను రక్షించడం, గౌరవాన్ని కాపాడటానికి ఇద్దరు నేతలు తమ నిబద్ధతను వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ఉద్రిక్తం
కష్టకాలంలో బంగ్లాకు నాయకత్వం వహిస్తున్న యూనస్ ను (Yunus) సలివన్ అభినందించారు. బంగ్లాదేశ్ సంపన్నమైన, స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి అమెరికా మద్దతుగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితి మరింత దిగజారింది. ఆయనకు న్యాయసాయం అందించడం పైనా ఆందోళనలు నెలకొన్నాయి. కాగా న్యాయస్థానం ఎదుటే జరిగిన అల్లర్లలో ఒకరు హత్యకు గురికాగా అనేక మంది గాయాలపాలయ్యారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో అనేక మందికి గాయాలు కాగా.. బంగ్లాలో మరోసారి పరిస్థితులు చేయి దాటిపోయాయి. దీంతో భారత్ బంగ్లాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. వెంటనే భారత్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి (Indian Foreign Secretary) విక్రమ్ మిస్ట్రీ అక్కడి హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మైనార్టీలపై దాడులు నిజమే
ఇటీవల ఢాకా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీమ్ ఉద్దీన్ తో సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తోనూ మిస్త్రీ మాట్లాడారు. ఈ భేటీ మరుసటిరోజే బంగ్లాలో దాడులకు సంబంధించిన నివేదికను బయట పెట్టింది. షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించింది. మరోవైపు.. ప్రస్తుతం భారత్లో ఉన్న షేక్ హసీనాను (former Prime Minister Sheikh Hasina) తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది.






