టాలీవుడ్ రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఖాతాలో చాలా రోజులుగా సరైన హిట్ లేదు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ (Family Stars) ఇలా వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఒక్క సాలిడ్ హిట్ కోసం విజయ్ చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజ్ అయిన కింగ్ డమ్ టీజర్ రౌడీ అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది.
కింగ్ డమ్ తో సాలిడ్ హిట్
కింగ్ డమ్ (KINGDOM) మూవీతో విజయ్ ఈసారి పక్కా హిట్ కొడతాడని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విజయ్ కింగ్ డమ్ తో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఫ్యామిలీ స్టార్ కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
దిల్ రాజు లీక్స్
ఈ నేపథ్యంలో దిల్ రాజుకు ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ (SVC)లో మరో సినిమా చేస్తున్నాడు. గతేడాది ఈ సినిమాను ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క అప్డేట్ రాలేదు. ‘రాజావారు రాణి వారు’ ఫేం రవికిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి దిల్ రాజు ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
విజయ్ రౌడీ జనార్ధన్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC Re Release) రీ-రిలీజ్ సందర్భంగా దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో వివిధ అంశాల గురించి మాట్లాడుతూ అనుకోకుండా ఆయన విజయ్ దేవరకొండ సినిమా పేరును లీక్ చేశారు. రవికిరణ్ దర్శకత్వంలో విజయ్ తో ‘రౌడీ జనార్ధన (Rowdy Janardhana)’ అనే సినిమా చేస్తున్నాడని తెలిపారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళం పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.






