
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన నటించిన కింగ్‌డమ్ (KINGDOM) మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీన విడుదల కావాల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొంత కాలంగా ఫ్లాపులతో ఉన్న విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
జులై 4వ తేదీకి వాయిదా
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నింగ్డమ్ మూవీని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే (bhagyashri borse) కథానాయిక. అనరుధ్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమా విషయంలో గత పది, పదిహేను రోజులుగా వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈనెల 30న రిలీజ్ చేయడానికి అన్నీ ప్లాన్ చేసుకున్నా.. ప్రస్తుతమున్న పరిస్థితుల కారణంగా జులై 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఊహించని ఘటనల కారణంగా..
‘‘మా ప్రియమైన ప్రేక్షకులకు.. మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని పేర్కొన్నారు. ‘ఈ నిర్ణయం కింగ్‌డమ్ సినిమాకు మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా ‘కింగ్‌డమ్’ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.