వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ (Rajya Sabha Chairman) ఆమోదించారని తెలిపారు.
నా రాజీనామాతో కూటమికే లబ్ధి
తాను రాజకీయాల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి వైదొలగితే తాను ఇంకా బలహీనుడినవుతాను.. తప్ప బలవంతుడిని కానని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. తన రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే తప్ప.. వైఎస్ఆర్సీపీ(YSRCP)కి కాదని స్పష్టం చేశారు. వైసీపీకి 11 మంది బలం మాత్రమే ఉందని.. ఎలాంటి ఆశలు, కేసు మాఫీలు తాను ఆశించలేదని పేర్కొన్నారు.







