Mana Enadu : అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహణతో ఏపీ సర్కార్ (AP Govt) ఇటీవలే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రభుత్వం మరో అద్భుత ప్రయోగం చేపట్టింది. విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్ (Sea Plane)’ ట్రయల్ రన్ తాజాగా సక్సెస్ అయింది.
సీ ప్లేన్ ట్రయల్ రన్
మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చి.. అక్కడి జలాశయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
శ్రీశైలానికి సీ ప్లేన్
ఈ నెల 9వ తేదీన పున్నమి ఘాట్‌లో విజయవాడ (Vijayawada) నుంచి శ్రీశైలం (Srisailam) మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఇవాళ (నవంబరు 8వ తేదీ) విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను శనివారం (నవంబరు 9వ తేదీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
విజయవాడ – శ్రీశైలం – విజయవాడ మధ్య సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రాబోయే రోజుల్లో కూడా రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏపీలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న స్వామి దేవాలయం (Srisailam Mallanna Swamy Devalayam) సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో ప్రయాణం ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు విశాఖ తీరం (Visakha Sea Shore), నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ రాష్ట్రంలో సాంకేతికంగా పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సీ ప్లేన్ కోసం ప్రయోగాలు చేపట్టారు.