
కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు కాదేదీ కలుషితానికి అనర్హం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. తినే తిండి, తాగే నీరు చివరకు పీల్చే గాలి కూడా విషతుల్యమై మానవుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. దేశంలో దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి పది మహానగరాల్లో నిత్యం 7% అకాల మరణాలకు కలుషిత గాలే కారణమని ప్రఖ్యాత వైద్యజర్నల్ ‘లాన్సెట్ (The LANCET)’లో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.
ఏపీలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
ఇక చిన్న చిన్న పట్టణాలు కూడా ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇక ఏపీలోనూ వాయు నాణ్యత అంతకంతకూ దిగజారుతోందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సీఆర్ఈఏ అధ్యయనం ప్రకారం గతేడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో (టాప్-10) విశాఖపట్నం ఆరు రోజులు, విజయవాడ మూడు రోజులు నిలిచాయి.
13 నగరాలు విఫలం
ఏపీ వ్యాప్తంగా 26 నగరాలు, పట్టణాలు 30 రోజుల వ్యవధిలో టాప్-67లో కనీసం ఐదు సార్లు ఉన్నట్లు సీఆర్ఈఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం వంటి నగరాలు జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్టు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది.
వాయు నాణ్యత సూచీ నాసిరకం
నిర్ణీత సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఓజోన్ స్థితి, గాలిలోని ధూళి రేణువులు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణాన్ని బట్టి గాలి నాణ్యతను లెక్కిస్తారన్న విషయం తెలిసిందే. వాయు నాణ్యత సూచీ (AQI) 0-50 మధ్య ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు అర్థం. అదే 51- 100 ఉంటే ఓ మోస్తరుగా, 101-200 మధ్య నాసిరకంగా ఉన్నట్లు లెక్క. 201-300 ఉంటే అనారోగ్యకరంగా ఉందని.. 301-400-తీవ్రం… 401-500 వద్ద అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు లెక్కిస్తారు. ఏపీలో సగటు ఏక్యూఐ 110-140 మధ్యలో ఉంటోంది.