
తెలుగురాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేయడం జరిగింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెప్పింది.
ఏపీలో ఈ నెల 27న అల్పపీడనం
అటు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 50-60కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మరోవైపు, ఏపీలో మే 1 – 21 మధ్య సాధారణ వర్షపాతం పాతం 39.2మి.మీ. నమోదు కాగా.. ఈ సంవత్సరంలో 126శాతం అధిక వర్షపాతం(Rain Fall) నమోదైందని వివరించింది.