Mana Enadu : 9 టు 5 జాబ్ అంటే చాలా మందికి విసుగు. ఉదయాన్నే లేచి ఆఫీసుకు వెళ్లి సాయంత్రం బయల్దేరి ఈ ట్రాఫిక్ లో రాత్రి ఎప్పుడో ఇంటికి చేరి.. మళ్లీ ఉదయం ఆఫీసు.. ఈ రొటీన్ తో చాలా మందికి ఉద్యోగం అంటే విసుగొచ్చేస్తుంది. రోజూ ఒకే సమయం.. ఒకే పనితో కొంతమందికి జాబ్ అంటే ఆసక్తి (Boring Job) కూడా తగ్గిపోతుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారా? అయితే, ఉద్యోగమంటే బోర్ డమ్ నుంచి బయట పడటానికి నిపుణులు కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటంటే..?
- ఉద్యోగంపై ఆసక్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణం మీరు పని చేస్తున్న రంగం.. మీకు ఆసక్తి ఉన్న రంగం వేర్వేరు కావడం కావొచ్చని వృత్తిరంగ నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా పని విషయంలో టెన్షన్‌కి గురవడం కూడా కావొచ్చని చెబుతున్నారు.
- పనిలో ఆసక్తి తగ్గడానికి రొటీన్ జాబ్ (Routine Job) కూడా కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయంలో మీరు డైలీ చేసే పనినే కాస్త డిఫరెంటుగా ట్రై చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా రోజు చేస్తున్న పనిలోనే కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.
- ఇక తోటి ఉద్యోగులతో విభేదాల వల్ల కూడా ఆఫీసంటే నిరాసక్తతను కలిగిస్తాయని అంటున్నారు. అందుకే అలాంటి విభేదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని చెబుతున్నారు.
- కొంతమందికి శాలరీ హైక్ (Salary Hike), ప్రమోషన్ (Promotions)విషయాల్లో తగిన ప్రతిఫలం అందలేదనే భావనతో కూడా ఉద్యోగమంటే అనాసక్తత ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీ స్కిల్స్ పెంచుకుని ఆఫీసులో మీకంటూ గుర్తింపు వచ్చేలా ప్రయత్నించాలి. కంపెనీ పురోభివృద్ధిని కోరుకొనే వారినే సంస్థ ప్రోత్సహిస్తుందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఆఫీసులో ప్రణాళికాబద్ధంగా పని చేయకపోవడం వల్ల కూడా.. జాబ్‌పై ఆసక్తి తగ్గిపోవడానికి కారణమని నిపుణులు అంటున్నారు. అందుకే మీకిచ్చిన పనిని నిర్ణీత సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.






