Mana Enadu : దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది. మన ఇంటితో పాటు జీవితాల్లోనూ వెలుగులు తీసుకొచ్చే వేడుక ఇది. ఇంటిల్లిపాది కలిసిమెలసి జరుపుకునే పండుగ. దీపావళి రోజున ఓ వైపు కుటుంబ సభ్యులతో మరోవైపు దీపకాంతులతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఈ పండుగ రోజు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక పిల్లలు బాణాసంచాతో మోత మోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలనే విషయంపై సందిగ్దత నెలకొంది.
అక్టోబర్ 31 లేదా నవంబర్ 1
ఏటా దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. అమావాస్య ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. మరి.. ఈ ఏడాది ఆ తిథి ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 31 వ తేదీనా? లేక నవంబర్ 1వ తేదీనా? అనే దానిపై ప్రజల్లో సందిగ్దద నెలకొంది. పంచాంగం ప్రకారం దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలో? దీనిపై జ్యోతిష్కులు ఏం చెబుతున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోజే దీపావళి
సాధారణంగా అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజునే పరిగణనలోకి తీసుకోని.. దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31వ తేదీన, నవంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల్లో సగం సగం విస్తరించి రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని.. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుందని తెలిపారు. కాబట్టి ఆ రోజున దీపావళి జరుపుకోవాలని క్లారిటీ ఇచ్చారు.
ఆరోజు పండుగ జరపొద్దు
అమావాస్య ఘడియలు అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 శుక్రవారం రోజు సాయంత్రం 6.15 వరకు ఉన్నా.. 1వ తేదీన దీపావళి జరుపుకోకూడదని చెబుతున్నారు. దీపావళి సాయంత్రానికి అమవాస్య తిథి ఉండాలని.. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పూట అమావాస్య లేనందున నవంబర్ 1న దీపావళి జరుపుకోకూడదని అంటున్నారు. మొత్తానికి అక్టోబర్ 31న గురువారం రోజు ఉదయం నరక చతుర్థశి .. సాయంత్రం దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు.