గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రావి మస్తాన్ సాయి (Mastan Sai Case). డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఇతడిపై రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..?
యువతులు, వివాహితలకు డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియో రికార్డు చేస్తున్నాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య(32) నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. 80 నగ్న వీడియోలు, ఫొటోలున్న ఓ హార్డ్‌డిస్కును పోలీసులకు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయితోపాటు యూట్యూబర్ ఖాజా (YouTuber Khaza Arrest)ను అరెస్టు చేశారు.
డ్రగ్స్ ఇచ్చి రేప్ చేస్తాడు
“ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో మస్తాన్ సాయి నాకు పరిచయమయ్యాడు. నాకు తెలియకుండానే అతడు నా ప్రైవేట్ వీడియోలు తీశాడు. అది తెలిసి ప్రశ్నిస్తే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కూడా అయింది. అయితే అతడు కేవలం నాపైనే కాదు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలకు డ్రగ్స్ ఇచ్చి మత్తులో ఉన్న వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వారి ప్రైవేట్ వీడియోలు రికార్డు చేశాడు. వాటితో వారిని బెదిరిస్తాడు. ఇలాంటి వీడియోలన్నీ ఓ హార్డ్ డిస్కు (Mastan Sai Hard Disk)లో ఉన్నాయి.
నన్ను చంపేస్తాడట
గతేడాది నవంబరులో ఆ హార్డ్ డిస్కును నేను తీసుకున్నాను. అందులో డ్రగ్స్ కేసులో అరెస్టయిన వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ను హ్యాక్ చేసి వీడియోలున్నాయి. నటుడు నిఖిల్ ఫోన్‌లోని ప్రైవేటు పార్టీ వీడియోలు కూడా సేకరించాడు. హార్డు డిస్కు నా దగ్గరున్న విషయం తెలుసుకున్న మస్తాన్ సాయి మా ఇంట్లోకి చొరబడి నాపై దాడి చేశాడు. నన్ను చంపి హార్డ్‌డిస్కు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. అందుకే పోలీసులను ఆశ్రయించాను’’ అని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇద్దరూ డ్రగ్స్ కేసుల్లో నిందితులే
ఇక మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉండగా.. సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలోనే మస్తాన్‌సాయి వ్యవహారం బయటకొచ్చింది. లావణ్య సైతం రెండు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలు.






