ఎక్కువ వ్యూస్, లైక్స్ పొందడానికి కొందరు యూట్యూబ్ (You Tube) ఛానెల్స్ నిర్వాహకులు కంటెంట్ కు సంబంధం లేని, తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటారు. తీరా అది ఓపెన్ చేసి చూస్తే ఈ థంబ్ నెయిల్ (You Tube Thumbnails) కు, టైటిల్ కు అందులో ఉన్న కంటెంట్ కు సంబంధమే ఉండదు. పైన టైటిల్ చూసి వీడియో ఓపెన్ చేసిన వ్యూయర్స్ సమయం వృథా. ఇలా తప్పుదోవ పట్టించే కంటెంట్ వల్ల యూజర్లు విసుగెత్తి పోతున్నారు. దీంతో యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది.
అలాంటి వారిపై యూట్యూబ్ ఉక్కుపాదం
ఇక నుంచి బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలోనూ ఇలాంటి క్లిక్ బైట్ టైటిల్స్ (You Tube Clickable Thumbnails), థంబ్‌నైల్స్ వాడకం ఇటీవల ఎక్కువైంది. ఈ క్రమంలో యూట్యూబ్ సంస్థ చర్యలకు ఉపక్రమించింది. ఎలాగైనా వీటికి అడ్డుకట్టు వేయాలని నిర్ణయించింది. తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్‌లోడ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు రంగం సిద్ధం చేసింది.
రూల్స్ బ్రేక్ చేస్తే స్ట్రైక్
ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సదరు వీడియో స్ట్రీమింగ్ సంస్థ తెలిపింది. అందులో భాగంగా త్వరలోనే కొత్త నిబంధనల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. రూల్స్ పాటించని వారి వీడియోలు డిలీట్ చేయనున్నట్లు వివరించింది. మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఛానల్‌పై స్ట్రైక్ (strikes) వేయనున్నట్లు చెప్పింది.








