యువ కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) దర్శకుడిగా మారనున్నారు. త్వరలోనే ఆయన మెగాఫోన్ పట్టి ఓ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా శనివారం ఉదయం రాహుల్ పోస్ట్ పెట్టారు. ‘‘దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్.. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్, ఫొటోలను నా మెయిల్‌కు పంపించగలరు’’ అని పేర్కొన్నారు. దర్శకుడిగా తొలి ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీమణుల ఎంపిక ప్రారంభించారు. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
డైలాగ్ రైటర్‌గా పనిచేసి..
షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ..‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే మూవీకి డైలాగ్ రైటర్‌గా పనిచేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2017లో విడుదలైన సంచలన మూవీ ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. కరోనా తర్వాత విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీలో లీడ్ రోల్ పోషించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. భరత్ అనే నేను, చిలసౌ, గీతాగోవిందం, కల్కి, బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురములో, ఓం భీమ్ బుష్, మనమే, ఖుషి, ఇంటింటి రామాయనం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.






